Headlines

ఉత్పత్తి పెరుగుతున్నా… సంక్షోభంలోనే రైతన్న

ఆర్‌ సూర్యమూర్తి

భారతదేశ వ్యవసాయ లక్ష్యాలు అద్భుతంగా ఉన్నాయి. పంటలు రికార్డు స్థాయిలో పండుతున్నాయి. కానీ పాలకుల వినాశకర విధానాలు రైతన్నలకు శాపంగా మారి వారి జేబులు ఖాళీగా ఉంటున్నాయి. ఉత్పత్తిలో పెరుగుదల కొనసాగుతున్నా పేద రైతులు ఇప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తేనే ఉన్నారు. భారతదేశంలో వ్యవసాయరంగం అతిపెద్ద రంగంగా ఉంది. ఏటా, మంత్రులు కెమెరాల ముందు నిలబడి రికార్డు ఉత్పత్తి లక్ష్యాలను ప్రకటిస్తున్నారు, దేశ రైతులు స్వయం సమృద్ధి, శ్రేయస్సు వైపు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. తాజాగా జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్‌ 2025లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ, 202526 సంవత్సరానికి 362.5 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించారు. ఇది పైకి చూడడానికి ఆకట్టుకునేలా కనిపిస్తోంది. లోతుగా పరిశీలిస్తేగానీ అసలు భండారం బయటపడదు. గత సంవత్సరం, భారతదేశం 353.96 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది - ఇది రికార్డు, ఆ ఏడాది అధికారిక ఉత్పత్తి లక్ష్యం 341.55 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువగానే ఉత్పత్తి జరిగింది. పాలకుల ఆకర్షణీయ నినాదాలు, సమావేశ మందిరాల్లో వారి ప్రసంగాలకు చప్పట్లను తరిచిచూస్తే చీకటిచిత్రం బయటపడుతుంది. భారతదేశ వ్యవసాయం లోపాయికారి సేకరణ, పెరిగిన సబ్సిడీలు, అస్థిర ప్రపంచ మార్కెట్లు, వాతావరణ మార్పు చక్రంలో చిక్కుకుపోయింది. ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలను నిర్ణయించడం వల్ల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రాజకీయ దృక్పథాలు, రైతు వాస్తవాల మధ్య వైరుధ్యాల కింద కుంగిపోతున్నదనే వాస్తవం మరుగునపడిపోతోంది. నిజమే, భారతదేశంలో బియ్యం, గోధుమలు విస్తారంగా పండుతున్నాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాములు నిండిపోతున్నాయి. 202324 సంవత్సరంలో ఈ రెండు పంటలపైనే సేకరణ ఖర్చు రూ. 2.1 ట్రిలియన్లు దాటింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందిస్తూనే ఉన్నారు.
ఒకపక్క కేంద్రం తనను తాను అభినందించుకుంటుండగా, దేశం తన వంట నూనె అవసరాలలో దాదాపు 60శాతం దిగుమతి చేసుకుంటోంది ప్రపంచంలోనే అతిపెద్ద పప్పు ధాన్యాల కొనుగోలుదారుగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ధాన్యం ఉందని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ప్రతి కొన్ని నెలలకు ఒకసారి కందిపప్పు లేదా పామాయిల్‌ను విదేశాలకు ఎగుమతి చేయడానికి తహతహలాడుతోంది. ఇది ఆహార భద్రత కాదు. ఇది ఎంపిక చేసిన సమృద్ధి – రాజకీయ నాయకులు ఎదుర్కోవడానికి నిరాకరించే విధానపరమైన అసమతుల్యత. బియ్యం, గోధుమలు ఎన్నికలలో లబ్ధి చేకూరుస్తాయి, నూనెగింజలు, పప్పుధాన్యాలు ఓట్లకు హామీ ఇవ్వవు కనుక బియ్యం, గోధుమల ఉచిత పంపిణీకి పాలకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ అసమతుల్యత యాధృశ్చికం కాదు. ఇది భారతదేశ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానంలో భాగంగా ఉంది. 23 పంటలకు ఎంఎస్‌పీ అధికారికంగా ప్రకటించినప్పటికీ, సేకరణ ఖర్చులో 70% కంటే ఎక్కువ బియ్యం, గోధుమలకు వెళుతుంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు ఈ వ్యవస్థ సవతి పిల్లలుగా మారిపోయాయి. వాటి
సేకరణలో ఒక క్రమపద్దతి ఉండదు. చాలా తక్కువగా నిల్వ చేస్తారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రైవేట్‌ మార్కెట్లలోకి తిరిగి పంపుతారు. రైతులు వెర్రివారు కాదు, బియ్యం లేదా గోదుమలను పండిస్తే ప్రభుత్వం సేకరిస్తుందనీ, ఎంతో కొంత మద్దతు ధర ఇస్తుందని వారికి తెలుసు. అదే పప్పుధాన్యాలు, నూనె గింజలు పండిస్తే నిలకడలేని ధరలు, మద్దతు ధర లేకుండా తమతో ఆటలాడుకుంటుందని రైతులకు బాగా తెలుసు.
రైతులను పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు మొగ్గు చూపాలని ప్రతి సంవత్సరం విధాన నిర్ణేతలు కోరుతున్నారు. అన్నదాతలు ఆ సూచనను ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే ప్రోత్సాహకాలు మార్పునకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రభుత్వం తన సేకరణ విధానాన్ని మార్చుకోకపోవడం, కావాల్సిన చోట డబ్బు పెట్టకపోవడమే నిజమైన వైఫల్యం తప్ప రైతుల ప్రతిఘటన కాదు. పంట ఎంపికను సేకరణ తప్పుదోవపట్టిస్తే మిగిలిన అన్నింటిని సబ్సిడీలు తప్పుదోవపట్టిస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశానికి రుతుపవనాలు లాటరీలాంటివి. ఇప్పుడు వారికి ఆటలామారింది. అనూహ్యంగా, వినాశకరంగా తయారైంది. ఈ ఏడాది సెప్టెంబరు మధ్యనాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 7శాతం అధికంగా నమోదైంది. కానీ సగటు గందరగోళాన్ని దాచిపెడుతున్నది. పంజాబ్‌, హర్యానా రాజస్థాన్‌ 40 నుంచి 68% అధిక వర్షపాతంతో మునిగిపోయాయి, బీహార్‌, అసోం 30నుంచి 40శాతం లోటుతో ఎండిపోయాయి. లడఖ్‌ 400% అధిక వర్షపాతంతో అతలాకుతలమైంది. ఇప్పటికే ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, అసోంలో వరదలకు చేతికి అందివచ్చిన పంటలు కొట్టుకుపోయాయి. కరువు వంటి పరిస్థితులు తూర్పు ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. మొత్తం మీద దేశంలో రికార్డు స్థాయిలో పంట పండిరదని గొప్పలు చెప్పుకోవచ్చు. వాస్తవంగా చూస్తే రైతన్న వ్యక్తిగతంగా నష్టాలు చవిచూస్తున్నాడు. అటువంటి నష్టాల నుంచి రైతన్నను బయటపడేసేందుకు ప్రధానమంత్రి పసల్‌ బీమా యోజన రూపొందించినట్టు పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయితే, ఆచరణలో ఇది పదేపదే విఫలమైంది. క్లెయిమ్‌ పరిష్కారం ఆలస్యం అవుతోంది, పంట నష్టం తక్కువ అంచనా వేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. నష్టపరిహారం కోసం రైతులు నెలలతరబడి వేచిచూస్తుండగా బీమా సంస్థలు మాత్రం కోట్లు సంపాదిస్తున్నాయి. పరిహారం సకాలంలో చెల్లిస్తామని ప్రతి సంవత్సరం మంత్రులు వాగ్ధానాలు గుప్పిస్తుంటారు, వరద ప్రభావిత ప్రాంతాలలోని రైతుల చెంతకు మాత్రం ఆ పరిహారం చేరకపోవడం అత్యంత విచారకరం.
విత్తనాలు సంమృద్ధిగా ఉన్నాయని ప్రభుత్వం నొక్కి చెపుతోంది. 22.9 మిలియన్‌ టన్నుల విత్తనాలు అవసరం ఉండగా, 25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని పాలకులు చెపుతున్నారు. అయితే, ఎరువుల కథ మరో విధంగా ఉంది. విత్తనాలు ఎక్కువగా నాటడంతో ఎరువులకు డిమాండ్‌ ఇప్పటికే పెరుగుతోంది. ఫాస్పేట్‌, పొటాషియం ఎరువుల దిగుమతి ప్రపంచ సుస్థిరతకు హానికలిగిస్తోంది. అధికారిక చానెళ్లు మూసుకుపోయినప్పుడు బ్లాక్‌మార్కెటింగ్‌ పెరుగుతుంది. రైతులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. ఇంకా దారుణంగా, నకిలీ విత్తనాలు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో నిర్వహించిన దాడుల్లో నకిలీ పురుగుమందులు, ఎరువులు బయటపడ్డాయి, కానీ అలాంటి దాడులు అడపాదడపా మాత్రమే జరుగుతాయి. పంటలు బాగా పండనప్పుడు మాత్రమే చిన్న వ్యాపారులపై దాడిచేసి నకిలీ విత్తనాలను కనుగొంటారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. నష్టాన్ని పూర్తిగా రైతులే భరిస్తున్నారు. బ్యూరోక్రాటిక్‌ ముసుగులో జవాబుదారీతనం కనుమరుగైపోతోంది. ‘‘ప్రయోగశాల నుంచి భూమికి’’ నినాదాలను ఇష్టపడే ప్రభుత్వాలు రైతులకు నకిలీ ఇన్‌పుట్‌లు అందకుండా చూసుకోవడం అత్యంత ప్రధాన బాధ్యత. అయినప్పటికీ, ఏటికేడు ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ గడువు దాటిపోయింది, అయినా, దాని గురించి నోరుమెదపడంలేదు. తాజా సర్వేలు వ్యవసాయ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం రూ.12,000 కంటే తక్కువగా ఉందని చూపిస్తున్నాయి. భారతదేశం ధాన్యం కొరత ఎదుర్కోవడం లేదు. రాజకీయ సంకల్పం కొరతతో బాధపడుతోంది. ఆ లోటును తీర్చే వరకు, ప్రతి రికార్డు పంట ఒక మైలురాయి కంటే తక్కువ కాదు – ఇది పురోగతికి రుజువు కాదు, కానీ విజయంగా ధరించిన విఫలమైన వ్యవసాయ ఆర్థిక శాస్త్రాన్ని దేశం ఎంత మొండిగా పట్టుకుని ఉందో దానికి నిదర్శనం.

The post ఉత్పత్తి పెరుగుతున్నా… సంక్షోభంలోనే రైతన్న appeared first on Visalaandhra.

​ఆర్‌ సూర్యమూర్తి భారతదేశ వ్యవసాయ లక్ష్యాలు అద్భుతంగా ఉన్నాయి. పంటలు రికార్డు స్థాయిలో పండుతున్నాయి. కానీ పాలకుల వినాశకర విధానాలు రైతన్నలకు శాపంగా మారి వారి జేబులు ఖాళీగా ఉంటున్నాయి. ఉత్పత్తిలో పెరుగుదల కొనసాగుతున్నా పేద రైతులు ఇప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తేనే ఉన్నారు. భారతదేశంలో వ్యవసాయరంగం అతిపెద్ద రంగంగా ఉంది. ఏటా, మంత్రులు కెమెరాల ముందు నిలబడి రికార్డు ఉత్పత్తి లక్ష్యాలను ప్రకటిస్తున్నారు, దేశ రైతులు స్వయం సమృద్ధి, శ్రేయస్సు వైపు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
The post ఉత్పత్తి పెరుగుతున్నా… సంక్షోభంలోనే రైతన్న appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *