Headlines

ఆదాయం కోసం మద్యం ఏరులై పారిస్తారా..?: హరీష్ రావు

 ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్న రేవంత్ సర్కార్ -ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. 6 గ్యారంటీలు 420 హామీల ఊసు లేదు.. కానీ, మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు. కెసిఆర్ తెచ్చిన పథకాలకు కోతలు, ప్రజలకు పన్నుల వాతలు తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా కొత్త పాలసీ తెచ్చిందని ఆరోపించారు. ఇపుడు మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారని అన్నారు. ఎన్నికలప్పుడు మాయ మాటలు..పాలనలోకి రాగానే మోసపు చేతలు..ప్రజలపై ఆర్టీసీ బస్సు చార్జీలు మోతలు..వాహనాలపై పన్నుల భారం..ఆర్‌ఆర్ టాక్స్‌లు అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలకు సంక్షేమం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కగానే గరీబోళ్ల సంపాదనను కొల్లగొట్టే పథకాలు రచిస్తున్నారని విమర్శించారు.

బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని తుంగలో తొక్కి గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారేలా చేసిందని అన్నారు. ప్రజలకు మద్యం తాగించడం ఖజానా నింపుకోవడం అనే విధానం రేవంత్ రెడ్ది పాటిస్తున్నారని, అందుకోసం అన్ని రకాల మద్యంపై ధరలు పెంచారని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు పెరగాలని అధికారులపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని, మద్యం అమ్మకాలు టార్గెట్ రీచ్ కాలేదని అధికారులకు మెమోలు ఇచ్చిన ఘనత రేవంత్ సర్కార్‌ది అని ఆరోపించారు. ఊరూరికి మైక్రో బ్రూవరీ తెచ్చి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ యూ టర్న్ సిఎం అని, ఎన్నికల్లో చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటి అని విమర్శించారు. మైక్రోబ్రూవరీల మూర్ఖపు ఆలోచన మానుకోవాలని హితవు పలికారు.

​ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్న రేవంత్ సర్కార్ -ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *