విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 26 నుండి 28 వరకు స్థానిక లయన్స్ క్లబ్ లో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గణేష్ చౌక్ నుండి ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్ వరకు దాదాపు 150 మంది కళాకారులతో తప్పెటగుళ్లు, కూచిపూడి, భరతనాట్యం, డప్పులు, గరగలు వంటి జానపద కళా నృత్యాలతో పూల వర్షం కురిపించి మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణేష్ చౌక్ వద్ద కొలువై ఉన్న గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోటసత్తెమ్మ తల్లి చిత్రపటాన్ని మంత్రి నారాయణకు బహుమతిగా అందించారు. వేదమంత్రాలు, మేళతాళాల మధ్య జ్యోతి ప్రజ్వలనతో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అతిథులు అందరూ ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ రాష్ట్ర గీతాలాపన జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుకల పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేసిన ఛైర్మన్లు,కౌన్సిలర్లు, అభివృద్ధిలో భాగమైన సేవా సంస్థలను, పౌరులను సన్మానించారు.
*భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి కందుల దుర్గేష్* నవంబర్ 26 భారత రాజ్యాంగం రాసిన రోజు కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో ఒకటైన భారత రాజ్యాంగాన్ని రాసిన డా.బి.ఆర్ అంబేద్కర్ ను మననం చేసుకొందామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని వర్ణిస్తూ ఈ సందర్భంగా భారత ప్రజలమైన మేము అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ కు జై అంటూ నినదించారు.
*వజ్రోత్సవ స్థూపం ఆవిష్కరణ* డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా తొలుత వజ్రోత్సవ స్థూపం ఆవిష్కరింపజేశారు. అనంతరం ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గానికి గోదావరి జలాలు రప్పించే ప్రాజెక్టు, మాలకోడు చెరువు ఆధునికీకరణ, ప్రధాన రహదారులు తదితర రూ.131 కోట్ల అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరించారు. అందులో భాగంగా రూ.446.50 లక్షల అంచనా వ్యయంతో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ మరియు మున్సిపల్ సాధారణ నిధులతో ఆర్టీసీ బస్టాండ్ నుండి పద్మా నర్సింగ్ హోమ్ వరకు మరియు రైల్వే స్టేషన్ రోడ్డనకు సీసీ రోడ్లు, డ్రైన్స్, పుట్ పాత్, సెంట్రల్ లైటింగ్, ఎంపీ రోడ్డు గణేష్ చౌక్ నుండి సబ్ స్టేషన్ వరకు పుట్ పాత్, డ్రైన్లు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
*నిడదవోలు చరిత్ర పుస్తకం ఆవిష్కరణ* చాళుక్య, కాకతీయులు ఏలిన ఘనమైన చరిత్రగల పురాతన పట్టణం నిరవద్యపురం గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని, భౌగోళిక స్వరూపాన్ని తెలిపేలా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జున రావు రచించిన నిడదవోలు చరిత్ర అనే పుస్తకాన్ని మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ లు ఆవిష్కరించారు.
*టిడ్కో గృహాల పరిశీలన..2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేత* నిడదవోలు పట్టణంలోని టిడ్కో గృహాలను మంత్రులు పి.నారాయణ, కందుల దుర్గేష్ లు స్వయంగా పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. తొలుత దెబ్బతిన్న ఇళ్లకు త్వరితగతిన మరమ్మత్తులు చేయించాలని, స్థానికంగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి ముళ్ల పొదలు తొలగించాలని అధికారులకు సూచించారు. 2014-19 కాలంలో టిడ్కో ఇళ్లు త్వరితగతిన నిర్మాణం జరుపుకున్నప్పటికీ గడిచిన ఐదేళ్లలో లబ్ధిదారులకు అందించకుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు అప్పుల పాలైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 2026 నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి పట్టణంలోని 1150 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంబంధిత కార్యాచరణ తయారు చేయాలని, డిసెంబర్ మొదటివారానికి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు అందించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. మంత్రి దుర్గేష్ తో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-19 కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందన్నారు.5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇప్పించిందన్నారు. 4.94 లక్షల ఇళ్లను గ్రౌండ్ చేశామన్నారు. గత ప్రభుత్వం 2.61 లక్షలకు కుదించి రద్దు చేసిందన్నారు. నాడు నిడదవోలు పట్టణానికి 1248 ఇళ్లు మంజూరు చేయగా గత ప్రభుత్వం 96 రద్దు చేసి 1152 నిర్మించాలని ఆదేశించిందని వివరించారు..దేశంలో నిరుపేదల కోసం తొలిసారి షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లను గత ప్రభుత్వం అర్థాంతంగా ఆపేసిందని ఆగ్రహించారు. గత ప్రభుత్వం ఇళ్ల విషయంలో చేసిన అవకతవకల వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు.లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకున్నా ఇచ్చినట్లుగా కాగితాలపై చూపించి లోన్లు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రూ.140 కోట్ల పెండింగ్ లోన్లు తిరిగి బ్యాంకులకు కట్టామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు ఉన్నాయన్నారు. టిడ్కో ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రూ.7000 కోట్లు అవసరమవుతాయన్నారు. అయినప్పటికీ కట్టే బాధ్యత లబ్ధిదారులకు ఇళ్లు అందించే బాధ్యత తమదని పేర్కొన్నారు. డిసెంబర్ 3,4 తేదీల్లో పనులు తిరిగి ప్రారంభిస్తామని, జూన్ 2026 చివరి నాటికి లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లు అందిస్తామన్నారు.
*ఆకట్టుకున్న వీడియో ప్రదర్శన* నిడదవోలు పట్టణ ప్రత్యేకతలను, మున్సిపాలిటీ నాటి నుండి నేటి వరకు ఎదిగిన తీరు, నిడదవోలు అభివృద్ధిలో భాగస్వాములైన వారిని, నిడదవోలు ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన వారిని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పట్టణ పౌరులకు అందిస్తున్న సేవలను వివరిస్తూ రూపొందించిన వీడియో అతిథులను, ఆహుతులను ఆకట్టుకొంది.
*అభివృద్ధికి చిరునామాగా నిడదవోలు..15 నెలల కాలంలో రూ.400 కోట్లతో అభివృద్ధి చేశాం:మంత్రి కందుల దుర్గేష్* ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 15 నెలల కాలంలో రూ.400 కోట్లతో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చామన్నారు. ఆర్ అండ్ బీ, గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. నిడదవోలు పట్టణంలో రూ.151 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. త్వరలోనే నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
*నిడదవోలుకు గత వైభవాన్ని తీసుకొద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు..గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేయాలని మంత్రి నారాయణకు దుర్గేష్ విజ్ఞప్తి* రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా పనిచేసి నిడదవోలుకు గత వైభవాన్ని తీసుకొద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నాడు గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఉన్న నిడదవోలు ప్రస్తుతం 28 వార్డులు, 51వేల జనాభాతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ప్రతి ఏటా నిడదవోలు మున్సిపాలిటీకి పన్నుల రూపేణా రూ.10 కోట్ల ఆదాయం వస్తోందన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో అందమైన నిడదవోలుకు బాటలు వేద్దామన్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన జనాభా, ఆదాయం దృష్ట్యా నిడదవోలుకు గ్రేడ్ 1 మున్సిపాలిటీ హోదా కల్పించాలని పురపాలక మంత్రి నారాయణకు మంత్రి కందుల దుర్గేష్ సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.తద్వారా మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సీసీ రోడ్లకు రూ.2.5 కోట్లు, సీసీ డ్రైన్స్ కు రూ.50 లక్షలు ఖర్చుచేశామన్నారు. చాలా పనులకు టెండర్లు పిలిచామని పనులు పూర్తయ్యాక అందమైన నిడదవోలును అందరూ చూస్తారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
*పురపాలక సంఘం బృందాన్ని ప్రశంసించిన మంత్రి కందుల దుర్గేష్* ప్రస్తుతమున్న పురపాలక సంఘం టీమ్ లో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆది నారాయణ, కమిషనర్ కృష్ణవేణి, కౌన్సిలర్లు పట్టణాభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు.
*నిడదవోలుకు మినీ స్టేడియం కల సాకారానికి కృషి:మంత్రి కందుల దుర్గేష్* సీఎస్ఆర్ నిధులతో నిడదవోలు మున్సిపాలిటీలో మినీ స్టేడియం ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
*ప్రజా సేవకుడిగా పనిచేస్తాను:మంత్రి కందుల దుర్గేష్* సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల పిలుపు మేరకు, వారి ఆలోచనల దృష్ట్యా తాను నిడదవోలు నుండి పోటీ చేసి గెలిచానన్నారు. ఎమ్మెల్యే అవుదామని వచ్చిన తనను మంత్రిని చేసిన ఘనత నిడదవోలు ప్రజానీకానిదని, అందుకు కృతజ్ఞత తెలిపారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించింది జనసేనాని పవన్ కళ్యాణ్ అని నాటి సంఘటనలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిడదవోలు అభివృద్ధికి ప్రజా సేవకుడిగా పనిచేస్తున్నానని, పనిచేస్తానని అన్నారు. నిడదవోలు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మున్సిపాలిటీ ఏర్పడి నుండి ఇప్పటివరకు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన నాయకులు, అధికారుల వల్ల జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అందరి కృషి వల్లే ప్రగతి సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధిని మంత్రి నారాయణ పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు.
*గత ప్రభుత్వ అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైంది:మంత్రి కందుల దుర్గేష్* గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని 100 పడకలుగా మార్చేందుకు కృషి చేశానని తెలిపారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది జీతాలకు రూ.4 కోట్లు, నిర్మాణానికి రూ.19 కోట్లు మొత్తం రూ.23 కోట్లకు అవసరమైన ఆర్థిక, పరిపాలన అనుమతులు తెచ్చామన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. వివిధ రూపాల్లో నిధులు సమీకరించి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ నెల్లూరులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఉదహరిస్తూ అదే తరహాలో నిడదవోలును ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. పరిశుభ్రతకు చిరునామాగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామన్నారు.విద్యా, వైద్య పరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు సఫలీకృతమవుతున్నాయన్నారు.
*త్వరలోనే నిడదవోలుకు గోదావరి జలాలు:మంత్రి కందుల దుర్గేష్* అమృత్ పథకం ద్వారా గోదావరి జలాలను నిడదవోలుకు తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. తద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందుతుందన్నారు.ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత వచ్చిందన్నారు.
*అందరి సహకారంతో నిడదవోలులో మరింత అభివృద్ధి..నెల్లూరు తరహాలో స్వంత పట్టణంగా నిడదవోలును గుర్తించి అభివృద్ధి చేయాలని మంత్రి నారాయణను కోరిన మంత్రి కందుల దుర్గేష్* ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ తదితర సహచర మంత్రులు, ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో నిడదవోలును మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అన్ని ప్రాంతాలతో పాటు నిడదవోలును ప్రత్యేకంగా గుర్తించి మరింత అభివృద్ధి చేయాలని మంత్రి నారాయణను మంత్రి దుర్గేష్ కోరారు. పట్టణంలో పురపాలక శాఖ ద్వారా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు తరహాలో స్వంత పట్టణంగా నిడదవోలును కూడా గుర్తించి అభివృద్ధి చేయాలని మంత్రి నారాయణను కోరారు. నిడదవోలు ముద్దుబిడ్డగా నిడదవోలును ఆదరించాలని కోరారు.
*రూ.3 కోట్లతో పర్యాటకంగా నిడదవోలు అభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్* పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో నిడదవోలును అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో అంతర్భాగం చేసి రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని మంత్రి దుర్గేష్ వివరించారు.అదే విధంగా తిమ్మరాజుపాలెంలో కొలువైన శ్రీ కోటసత్తెమ్మ ఆలయాన్ని ఆధునికీకరణ చేసి భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. కాలువల ఆధునికీకరణతో పాటు బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా నిడదవోలును తీర్చి దిద్దుతున్నామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి స్థానికంగా ఉన్న పుష్కర ఘాట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిడదవోలును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.
*నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటన* మంత్రి కందుల దుర్గేష్ వినతి మేరకు నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయమై రిజల్యూషన్ చేసేందుకు కమిషనర్, సెక్రటరీతో మాట్లాడానన్నారు.ఉత్సవాలు అయ్యే నాటికి 28వ తేదీ సాయంత్రం మున్సిపాలిటీ అప్ గ్రేడ్ జీవో కాపీని అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రభుత్వ విప్, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ,నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టి.ఎల్.పి.ఎస్.ఎస్. కృష్ణవేణి, కౌన్సిలర్లు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
The post అట్టహాసంగా నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుక appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 26 నుండి 28 వరకు స్థానిక లయన్స్ క్లబ్ లో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గణేష్ చౌక్ నుండి ఐ లవ్ నిడదవోలు పార్క్
The post అట్టహాసంగా నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుక appeared first on Visalaandhra.
