Headlines

అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ ఆటోమేటిక్‌ రెన్యువల్‌ రద్దు

ట్రంప్‌ ప్రభుత్వ కొత్త నిర్ణయం.. వేలాది మందిపై ప్రభావం

వైట్‌హౌస్‌: అమెరికాలో వలసదారులపై కఠిన విధానాలు కొనసాగిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ చేసే విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా హౌంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 అక్టోబర్‌ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్‌ పర్మిట్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్‌ రెన్యువల్‌ ఉండదని స్పష్టం చేసింది. అయితే, ఈ తేదీకి ముందు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

బైడెన్‌ కాలం సౌకర్యాలకు ముగింపు
గతంలో బైడెన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వలసదారులు తమ వర్క్‌ పర్మిట్‌ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు ఉద్యోగం చేసుకునే వీలు ఉండేది. పర్మిట్‌ రెన్యువల్‌ దరఖాస్తు ప్రాసెస్‌ పూర్తయ్యే వరకు ఆ తాత్కాలిక పొడిగింపు వారికి రక్షణగా ఉండేది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని నిలిపివేసి, వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ”వర్క్‌ పర్మిట్‌ గడువు ముగియడానికి కనీసం 180 రోజుల ముందే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేయాలి. ఆలస్యమైతే తాత్కాలికంగా ఉద్యోగ అనుమతి రద్దు అయ్యే అవకాశం ఉంది” అని అధికారులు హెచ్చరించారు.

ఏంటి ఈ ఈఏడీ పత్రం?
ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఇది ఉన్నవారికి మాత్రమే అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే హక్కు ఉంటుంది. ఈ పత్రం గడువు ముగిసిన తర్వాత ఉద్యోగం కొనసాగించాలంటే తప్పనిసరిగా రెన్యువల్‌ చేయాలి. గ్రీన్‌కార్డ్‌తో శాశ్వత నివాసం పొందిన వారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హెచ్‌-1బీ, ఎల్‌-1బీ, ఓ, పీ వంటి వీసాలతో ఉన్న నాన్‌ ఇమిగ్రెంట్‌ ఉద్యోగులు కూడా వేరుగా ఈఏడీ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రీన్‌కార్డ్‌ పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, అలాగే ఎఫ్‌-1, ఎం-1 వీసాలతో చదువుకునే విద్యార్థులు లేదా డిపెండెంట్‌ వీసాతో ఉన్నవారు అమెరికాలో పని చేయాలనుకుంటే తప్పనిసరిగా ఈఏడీ తీసుకోవాలి.

భారతీయులపై ప్రభావం
అమెరికాలో ఉన్న భారతీయ వలసదారులలో అనేక మంది ఈఏడీ ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్‌ రెన్యువల్‌ విధానం రద్దు కావడంతో వారికి గడువు ముగిసే ముందే దరఖాస్తు చేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో ఐటీ, హెల్త్‌కేర్‌, రీసెర్చ్‌ రంగాల్లో పని చేస్తున్న భారతీయులు ఈ కొత్త నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, వలస విధానాల్లో కఠినతరం దిశగా ట్రంప్‌ ప్రభుత్వం మరో అడుగు వేసిందని నిపుణులు అంటున్నారు. వర్క్‌ పర్మిట్‌ రెన్యువల్‌ నిబంధనలు కఠినతరం కావడంతో వలసదారుల భవిష్యత్‌ మరింత అనిశ్చితంగా మారనున్నదని చెప్తున్నారు.

The post అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ ఆటోమేటిక్‌ రెన్యువల్‌ రద్దు appeared first on Navatelangana.

​ట్రంప్‌ ప్రభుత్వ కొత్త నిర్ణయం.. వేలాది మందిపై ప్రభావం వైట్‌హౌస్‌: అమెరికాలో వలసదారులపై కఠిన విధానాలు కొనసాగిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ చేసే విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా హౌంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2025
The post అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ ఆటోమేటిక్‌ రెన్యువల్‌ రద్దు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *